🔥శోధనల తర్వాత సువర్ణమే!
శ్రమలు, పరిపూర్ణత ఒకదానివెంట ఒకటి నడుస్తాయి. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ, విభజింప శక్యముకానివిగా ఉంటాయి. ప్రతీ పొడవైన చీకటి సొరంగం తరువాత, తేజోమయమైన వెలుగుంటుంది. అదే విధంగా సుదీర్ఘమైన శ్రమలు విశ్వాసిని పరిపూర్ణతయనే గురివైపుకు నడిపిస్తాయి.
💥కంసాలి చేతిలో బంగారం పరిశుద్ద పరచాబడాలంటే అది నిప్పులకొలిమిలో మండాల్సిందే!
💥కుమ్మరివాని చేతిలోని బంకమన్నుకు ఒక రూపం రావాలంటే అది కుమ్మబడాల్సిందే, కాల్చబడాల్సిందే!
💥కొయ్యకు ఒక రూపం రావాలంటే రంపంతో కోయబడాల్సిందే, ఉలితో చెక్కబడాల్సిందే!
💥వజ్రం ప్రకాశించాలంటే అది నూరబడాల్సిందే!
💥రాయి శిల్పంగా మారాలి అంటే అది సుత్తి దెబ్బలు తినాల్సిందే!
💥నీవు పరిపూర్ణతలోనికి చేరాలంటే శ్రమ అనుభవించి తీరాల్సిందే.
💮 శ్రమలు విధేయతను నేర్పిస్తాయి:
శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. -హెబ్రీ 5 : 7-9
💮 శ్రమ లేకుండా కిరీటం లేదు.
శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. (యాకోబు 1 : 12)
నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును. -యోబు 23:10
💮 శ్రమ లేకుండా ఘనత లేదు.
నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును.
-1 పేతురు 1 : 7
శ్రమలే నిత్యజీవానికి చేర్చే మార్గాలు. శ్రమపడడానికి యిష్టంలేదు అంటే? నిత్యజీవపు తలుపులు మనచేతులతో మనమే మూసివేస్తున్నట్లు. శ్రమలయందు అతిశయిస్తూ, శ్రమలలో ఆయన కృపకొరకు కనిపెట్టెదము. శోధనతోపాటు, సమాధానాన్ని కూడా ఏకకాలంలో అనుభవించడం దేవునిపిల్లలముగా మనకే సాధ్యం! అది నీకే సాధ్యం!

No comments:
Post a Comment