మన ప్రభువును ప్రియ రక్షకుడునునైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాను.
నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనబోతున్నాము. ఇది క్రొత్తేమికాదు. ఇట్లాంటి నూతన సంవత్సరాలు ఎన్నో ఎదుర్కొన్నాము. కానీ, నూతనత్వం మాత్రం కనిపించినట్లు లేదు. అయితే, వాటిలో ఈ నూతన సంవత్సరం కూడా ఒకటి కాకూడదు అంటే? ఇది ప్రత్యేకమైనదైయుండాలి. అట్లాఅని “2020” దాని సంఖ్యనుబట్టి కాదుగాని, మనము తీసుకొనే తీర్మానమునుబట్టి.
♻️ శుభప్రదమైన సంవత్సరంగా దీనిని ప్రారంభించి, ముగించాలంటే, ఏమి చెయ్యాలి?
1. ప్రతిభారమును విడిచిపెట్టు
2. సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టు
3. యేసువైపు చూడు
4. పందెములో ఓపికతో పరుగెత్తు
ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. (హెబ్రీ 12:2)
💮 1. ప్రతిభారమును విడిచిపెట్టు
పరుగుపందెములో పరిగెత్తేవారు తలమీద ఒక బస్తా బరువు పెట్టుకొని పరిగెత్తడం సాధ్యం కాదు. సాధ్యపడినా విజయం మాత్రం దక్కదు. అందుకే, కనీసం వారు ధరించే వస్త్రాలు సహితం తేలికగా వుండేలా చూచుకుంటారు. విశ్వాసయాత్రలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. పుట్టిన ప్రతీమనిషి అనేక భారాలను మోస్తూవున్నాడు. దానిలో ప్రాముఖ్యమైనది పాపభారం. దానిని భుజాన వేసుకొని ఎన్నిసంవత్సరాలు పరిగెత్తినా ఒక్క అడుగుకూడా ముందుకువేయలేము. ఇన్ని సంవత్సరాలకాలంలో మన జీవితంలో ఇదే జరుగుతుంది. పరుగు పందెములో ముందుకు దూసుకొనిపోవాలంటే? నీవు మోస్తున్న ప్రతీ భారాన్ని విడిచిపెట్టాలి. నీవు ప్రశ్నించొచ్చు, నాకు ఆర్ధిక భారముంది, కుటుంబ భారముంది ఇట్లా ఏవేవో వున్నాయి వాటన్నిటిని విడచిపెట్టేస్తే వాటిని మోసేదెవరని? అది ఆర్ధిక భారమైనా, పాప భారమైనా, అది ఏ భారమైనా సరే. నీవు విడిచిపెడితే మోసేవారొకాయన వున్నారు.
★ నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును. - (కీర్తనలు 55:22)
★ నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. - (సామెతలు 16:3)
★ మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. - (1 పేతురు 5:7)
★ నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును. - (కీర్తనలు 37:5)
★ ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. - (మత్తయి 11:28)
💮 2. సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టు:
ప్రతీభారమును ప్రభువుకు అప్పగించి, మరింత బలాన్ని పొందుకొని విశ్వాస పరుగుపందెములో దూసుకొనిపోతున్నపుడు మనలను సులువుగా చిక్కులుపెట్టే పాపము ఏమిటంటే “అవిశ్వాసము”. విశ్వాస పరుగుపందెములో సాతాను అడ్డుగా వచ్చి, నీవు పరుగెత్తలేవు. విజయం సాధించలేవు అంటూ, భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వీకుడు (సంఖ్యా 12:3) అని దేవునిచేత సాక్ష్యము పొందిన మోషే ఏమి చేసాడు? బండతో మాట్లాడమంటే, బండను కొట్టాడు. నా హృదయానుసారుడైన మనుష్యుడు ( అపో. కా. 13:22) అని దేవునిచేత సాక్ష్యము పొందిన దావీదు ఏమి చేసాడు? బత్షెబతో పాపముచేసి, అతని భర్తను చంపించాడు. దేవునిచేత సాక్ష్యముపొందిన వీరిద్దరే విశ్వాసయాత్రలో ఓడిపోయారు. నీవెంత? గతించిన నీ జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటూ దేవునిచే క్షమించబడిన వాటన్నిటిని తిరిగి నీ జ్ఞాపకంలోనికి తీసికొనివచ్చి, విజయం సాధించడం నీవల్లకాదంటూ అనేకమైన ప్రశ్నల వర్షాన్ని కురిపించి నిజంగా ఇదినావలన కాదు అనిపించేటట్లు అవిశ్వాసాన్ని మనలో నింపుతాడు. అట్లాంటప్పుడు క్షమించబడిన పాపములను ప్రభువు ఎంతమాత్రమూ జ్ఞాపకము చేసుకొనరనే విశ్వాసమును మనము కలిగియుండి, శ్రమలలో తన విశ్వాసమును కాపాడుకొనిన యోబు వలే, శోధనలలో తన పరిశుద్ధతను కాపాడుకొనిన యోసేపువలే నేను జీవిస్తానని చెప్పగలగాలి. తద్వారా సులువుగా చిక్కులు పెట్టు “అవిశ్వాసము” అనే పాపములో చిక్కకుండా విశ్వాసముతో స్థిరులగుదుము.
💮 3. యేసువైపు చూడు:
ప్రతీ భారమును విడచిపెట్టి, విశ్వాస యాత్రలో సులువుగా చిక్కులుపెట్టే పాపమైన అవిశ్వాసములో చిక్కకుండా, పరుగు పందెములో దూసుకుపోతున్నప్పుడు అనేక మార్గాలు మనలను ఆకర్షిస్తుంటాయి. కొన్ని మార్గాలు అత్యంత విశాలంగా కనిపిస్తే, మరికొన్ని మార్గాలు గమ్యానికి దగ్గర మార్గాలుగా కనిపిస్తాయి. సాతాను అనుక్షణం మనలను అటువైపు మలచి, గమ్యంవైపు సాగిపోకుండా వాడు సృష్టించని అడ్డంకులంటూ ఏమి వుండవు. మన ప్రతీ బలహీనతను వాడి బలముగా మలచుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే, విశ్వాస యాత్రలో యేసువైపు మాత్రమే చూడాలి. ఎందుకంటే, ఆయనే విశ్వాసమునకు కర్త. ఆయనే కొనసాగించువాడు. మనము చేరాల్సిన గమ్యం ఆయనకు మాత్రమే తెలుసు. “నేనే మార్గమును” ( యోహాను 14:6) వేరొక మార్గము లేనేలేదు. “గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే” (యోహాను 10:8) వేరొక ద్వారము లేనేలేదు. ఆయన మాత్రమే మనలను నడిపించగలడు. గమ్యానికి చేర్చగలడు. అయితే, ఆయన మనకు కనిపించరు కదా? ఆయనవైపు చూసేదెట్లా? కొన్ని సందర్భాలలో చీకటిగుండా కాపరి మందను తీసుకొని వెళ్తున్నప్పుడు, కాపరి ఎటువైపు వెళ్తున్నాడో, గొర్రెలకు కనిపించడు. అట్లాంటప్పుడు, కాపరి దుడ్డుకర్రతో నేలమీద టక్....టక్ ....టక్ అంటూ శబ్దం చేసుకొంటూ ముందుకు వెళ్లిపోతుంటే, ఆ శబ్దాన్ని బట్టి గొర్రెలు కాపరిని అనుసరిస్తూ సాగిపోతాయి. "గొర్రెలకు కాపరి కనిపించకపోయినా, శబ్దం వినిపిస్తుంది ముందుకు సాగిపోవడానికి." "మన ప్రభువు కనిపించకపోయినా, ఆయనిచ్చిన వాగ్దానాలు వినిపిస్తున్నాయి ముందుకు సాగిపోవడానికి."
💮 4. పందెములో ఓపికతో పరుగెత్తు:
ప్రతీ భారమును విడచిపెట్టి, విశ్వాస యాత్రలో సులువుగా చిక్కులుపెట్టే పాపమైన అవిశ్వాసములో చిక్కకుండా, యేసువైపు చూస్తూ పరుగెత్తుతున్నప్పుడు, దారిలో సాతాను శోధనలు, వేదనలు, శ్రమలు అనే అడ్డుబండలను వుంచుతాడు. అవి తగిలి క్రిందపడుతూ ఉంటాము. అయినప్పటికీ ఆగిపోకూడదు. లేచి మరలా పరిగెత్తాలి. అనేక సందర్భాలలో సహనం కోల్పోతాము. శోధన వెంబడి శోధన తరుముకొస్తూ ఉంటుంది. మనము ఒక్కసారి వెనుకకు తిరిగి చూడగలిగితే, కృప వెంబడి కృప కూడా మనలను వెంబడిస్తూనే ఉంటుంది. ఎన్ని అడ్డంకులొచ్చినా అంతమువరకూ సహించాలి. సహించలేకపోతే జీవ కిరీటం దక్కదు (యాకోబు 1:12 ). ఎన్ని శోధనలొచ్చినా గమ్యం వైపే పరుగెత్తాలి. పరుగు తుదముట్టించకపోతే నీతి కిరీటం దక్కదు. (2తిమోతి 4:7) గర్భవతిగా నున్న తల్లి, ఎన్ని యిబ్బందికరమైన పరిస్థితులొచ్చినా, వాటన్నిటిని సహిస్తూ పుట్టబోయే బిడ్డకోసం చివరి క్షణం వరకు ఎట్లాంటి నిరీక్షణతో ఎదురుచూస్తుందో, అట్లానే విశ్వాస పరుగు పందెములో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురుగా వచ్చినా, వాటన్నిటినీ సహిస్తూ, శ్రమలయందునే అతిశయిస్తూ, నిరీక్షణతో ఆ నిత్యమైన బహుమానము పొందడానికి పరుగెత్తెదము. ఆగిపోవద్దు. సాగిపోవుదము ఆ గమ్యం చేరేవరకు. ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:
Post a Comment