సమరయ

సేకరణ
💐 సమరయ ప్రాంతం ✍️

 దేవుని నామమునకు మహిమ కలుగును గాక! యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభుల వారు సువార్త ప్రకటిస్తూ మార్గమధ్యంలో సమరయ అనే ప్రాంతం వస్తారు. అక్కడ సుఖారు అనే గ్రామ శివారులో యాకోబుగారు యోసేపుకిచ్చిన బావి దగ్గర అలసినరీతినే కూర్చొన్నారు. అప్పుడు ఇంచుమించు పండ్రెండు గంటలయ్యింది అని వ్రాయబడింది.(4,6 వచనాలు)

         ఏసుప్రభువు యూదుడు. వెళ్ళిన ప్రాంతం సమరయ. ఇశ్రాయేలు దేశం ప్రాముఖ్యంగా యూదయ, సమరయ, గలలియ అనే మూడు ప్రాంతాలుగా విభజింపబడింది. యూదయ గలలియ ప్రాంతాలకి మధ్యలో ఈ సమరయ ప్రాంతం ఉంది. అయితే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయుల నీరు త్రాగరు, మాట్లాడరు, భోజనం చేయరు. సమరయులను యూదులు పాపులుగా, వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, *అంటరానివారుగా* పరిగనిస్తారు. చివరకి యూదయనుండి గలలియకు సమరయ మీదుగా దగ్గరదారి అయినా సరే చుట్టూ తిరిగివెల్తారు తప్ప సమరయలో అడుగుపెట్టరు. ఎందుకు అంటే మనం చరిత్ర తెలుసుకోవాలి.

       అది ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉంది. ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ, షెమెరు అనే వ్యక్తిదగ్గర రెండు తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానికి షోమ్రోను(సమరయ) అని పేరు పెట్టినట్టు చూస్తాం  1 రాజులు 16వ అధ్యాయం. కాలక్రమేనా ఈ పట్టణం అనేకసార్లు దాడికి గురిచేయబడ్డాది. (1,2వ రాజులు).  సమరయులు అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీ.పూ. 677- 721 మధ్యలో ఏషర్హద్దోన్ అనే అస్సూరు రాజు ఆప్రాంతాన్ని జయించి ఇశ్రాయేలీయులను చెరపట్టి, అస్సూరు రాజ్యానికి తీసుకొనిపోయాడు. ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడు. ఈ రకంగా వచ్చిన మిశ్రమ జాతి వారే సమరయులు.(2రాజులు 17: 24-41). ఇది దేవునికి ఇష్టంలేని పని. అందువల్ల దేవుడు సింహాలను పంపుతారు. తర్వాత వారు తమ విగ్రహాలను విడచిపెట్టి క్రమక్రమంగా యూదుల ఆచారాలను, యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెడతారు. (ఎజ్రా 4:2,9,10; లూకా 17:18). అయితే యూదులు/ఇశ్రాయేలీయులు చెర విముక్తి పొందిన తర్వాత దైవాజ్న మేరకు మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ సమరయులు మేము కూడా మీ దేవున్నే ప్రార్దిస్తున్నాం. మేము కూడా మీతోపాటు మందిరాన్ని కడతాం అంటే జెరుబ్బాబెలు, యెశూవ అనే పెద్దలు దానికి అంగీకరించరు. నెహేమ్యా గారైతే ఏకంగా మీకు మాలో పాలైనను, స్వాస్త్యమైనను లేదని ఖరాఖండిగా చెబుతారు. అప్పటినుండి యూదులకు/ఇశ్రాయేలీయులుకు మధ్య వైరం మొదలైంది. చివరకు సమరయులు గెరీజీము కొండమీద ఒక మందిరాన్ని కట్టుకొంటే క్రీ.పూ. 139 లో ఒక యూదురాజు దానిని పడగొట్టినట్లు చరిత్ర చెబుతుంది. అప్పుడు వారు సమరయ అనగా షెకెము కొండమీద ఒకమందిరాన్ని కట్టుకొని ఆరాదించడం మొదలు పెట్టారు. ఈ రకంగా ఈ రెండుజాతులకు మధ్య వైరం యేసయ్య వచ్చేవరకూ కూడా కొనసాగింది. ఇప్పటికి కూడా 160 సమరయ కుటుంబాలు ఈప్రాంతంలో నివాసం చేస్తున్నారు.   

                    మత్తయి సువార్త10:5 లో "యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి"
సమరయులు అంటే యూదులు కానివారు. సమరయ ప్రజలంటే సంకర జాతివారు. వీరి పుట్టుపూర్వోత్తరాలు 2 రాజులు 17వ అధ్యాయంలో చూడవచ్చు. వీరు ఉత్తరాన గలలీకి, దక్షిణాన యూదయకు మధ్య ఉన్న సమరయ ప్రదేశంలో నివసించారు. చాలావరకు యూదులు సమరయవారిని అసహ్యించుకునేవారు. వారితో ఎలాంటి పొత్తూ పెట్టుకునేవారు కాదు (యోహాను 4:9). అయితే వారికి బోధించవద్దని యేసు తన శిష్యులతో చెప్పిన కారణం ఇది కాదు. వారికి శుభవార్త ప్రకటించే సమయం ఇంకా రాలేదు (ఆ సమయం తరువాత వచ్చింది – యోహాను 4:1-42; అపొ కా 8:5-25). అబ్రాహాము కాలంనుంచి యూదులు దేవుని ప్రజలే (ఆది 12 అధ్యాయం). దేవుడు వారితో ప్రత్యేకమైన ఒడంబడికలు చేశాడు. అందువల్ల దేవుని రాజ్య శుభవార్త వారికి ప్రథమంగా బోధించడం తగిన విషయమే.

★ సమరయులు ప్రాంతానికి వెళ్లిన యేసు:
సమరయులు దగ్గరికి వెళ్లొద్దు అన్నటువంటి యేసు అక్కడికి వెళ్లడం జరిగింది.
 యూదయ, గలలీ ప్రాంతాలమధ్య ఉన్న ప్రాంతం సమరయ. ఆ ప్రాంతం ప్రజలను యూదులు సాధారణంగా అసహ్యించుకునేవారు (వ 9. సమరయవారి గురించి  2 రాజులు 17:24; మత్తయి 10:5). యూదయనుంచి గలలీ ప్రాంతానికి వెళ్ళాలంటే సమరయ మీదుగా వెళ్ళేది దగ్గర దారి. కానీ చాలామంది యూదులు సమరయ ప్రజలను తప్పించు కొనేందుకు ఆ ప్రదేశం బయటగా చుట్టు దారిన ప్రయాణించే వారు. యేసు సమరయ మీదుగా “వెళ్ళవలసి వచ్చింది” అంటున్నాడు యోహాను. హడావుడిగా గలలీకి చేరుకోవలసి ఉంటే, లేక సమరయలో చెయ్యవలసిన పనేదైనా ఉంటే ఈ విధంగా ప్రయాణించడం అవసరం. వ 40లో యేసు తొందరగా ప్రయాణం చేయడం లేదని కనిపిస్తుంది. అయితే ఈ అధ్యాయం మిగతా భాగమంతా సమరయ ప్రాంతంలో చెయ్యాలనుకున్న ఒక పని ఆయనకు ఉందని తెలియజేస్తున్నది. ఎంత మంచి పని అది! అలా ప్రయాణం చెయ్యడానికి మరో కారణం బహుశా ఆ ప్రజలపై యూదులకు సామాన్యంగా ఉండే ద్వేషం తనకు లేదని చూపించుకోవడానికి కావచ్చు.
    అయితే ఇటువంటి అంటరానిప్రాంతంగా, పాపపు ప్రాంతంగా,దొంగలతో నింపబడిన ప్రాంతంగా,  ప్రజలందరితోను వెలివేయబడిన ప్రాంతానికి, ఏ ప్రవక్త, బోధకుడు కూడా వెళ్ళని, వెళ్ళడానికి భయపడే ప్రాంతానికి లోకరక్షకుడైన యేసయ్య తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించారు. ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించిన స్త్రీ మామూలు వ్యక్తికాదు. ఏ మాత్రం మంచిసాక్ష్యం లేని ఒక వ్యక్తిని ఎన్నుకొని, ఆ ప్రాంతాన్ని మార్చిన వైనం నిజంగా అధ్బుతం!
         ఈరోజు నీవు కూడా ప్రజలందరితోను వెలివేయబడ్డావా? అందరూ నిన్ను ఎందుకూ పనికిరానివాడు/పనికిరానిది అని హేలనచేస్తున్నారా? నీవు అంటరానికులంలో పుట్టావు అని హేలనచేస్తున్నారా? నీ భర్త, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ నిన్ను విడచిపోయారా? భయపడొద్దు! పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకానికి వచ్చారు. ఎవరైతే పాపులో, వెలివేయబడ్డారో, అంటరానివారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికే యేసయ్య వచ్చారు.

★ సమరయుల ప్రాంతానికి వెళ్లిన ఫిలిప్పు:
అపోస్తులు 8:5, ఈ ఫిలిప్పు క్రీస్తురాయబారి ఫిలిప్పు కాదు గాని “భోజనాదులు పంచిపెట్టడానికి” స్తెఫనుతోపాటు నియమించ బడ్డవాడొకడు (6:1-6). 6:8లో స్తెఫన్ను గురించిన నోట్స్ ఇతనికి కూడా వర్తిస్తుంది. సమరయ గురించి నోట్స్ మత్తయి 10:5; యోహాను 4:4; 2 రాజులు 17:24. సమరయకు యేసుప్రభువు తానే రావడం మూలాన (యోహాను 4:4-42) ఇప్పుడు శుభవార్త వినడానికి సమరయవారు సిద్ధంగా ఉన్నారు. శుభవార్త వ్యాపకంలో ఇది గొప్ప ముందంజ. మనకు తెలిసినంత మట్టుకు మొదటిసారిగా క్రీస్తు శిష్యులు యూద సమాజానికి బయట ఉన్నవారికి శుభవార్త ప్రకటించడం జరిగింది. ఈ విధంగా వారు 1:8ను నెరవేర్చడం ఆరంభించారు.

4:42 క్రీస్తే ముక్తి ప్రదాత అని మొత్తంగా యూదులు నమ్మడానికి నిరాకరించగా (1:11), యూదుల దృష్టిలో అంటరాని వారైన ఈ సమరయవారు సత్యాన్ని గ్రహించిన ధన్య స్థితిలోకి వచ్చారు. “ముక్తిప్రదాత”, “రక్షకుడు” గురించి నోట్ లూకా 1:47 చూడండి. యేసులో నమ్మకం ఉంచిన వారందరికీ, వారు ఏ జాతి, ఏ దేశం వారైనప్పటికీ, ఆయన ముక్తిప్రదాతే (1 తిమోతి 2:3-6; రోమ్ 1:16-17; అపొ కా 4:12; మార్కు 16:15-16).

★ సమరయుని గూర్చి:
లుకా 10:33-35 సమరయవారి గురించి యోహాను 4:4-9 లో వ్రాయబడి ఉంది. యూదులు వీరిని చిన్న చూపు చూశారు. వారితో ఎలాంటి సాంగత్యం చేయలేదు. ఈ సమరయవాడు ప్రేమ అంటే ఏమిటో, పొరుగువాడి బాధ్యతలేమిటో చూపించాడు. మనకు ఎవరు ఎదురైతే వాడే మన పొరుగువాడు. అతని జాతి, దేశం, రంగు, మతం ఏదైనా సరే. ఈ వచనాల ఆధ్యాత్మిక భావం వ 25లోని ప్రశ్నకు జవాబిస్తున్నది. ఈ ఉదాహరణలోని మనిషి చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. తన ప్రాణం కాపాడు కునేందుకు, తిరిగి తనకు ప్రాణం పోసేందుకు ఏమీ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. అతడు పూర్తిగా నిస్సహాయుడు. రోమ్ 5:6; 8:7; ఎఫెసు 2:4-5 పోల్చి చూడండి. మనుషుల తిరస్కారానికీ ద్వేషానికీ గురి అయిన క్రీస్తును ఈ సమరయవాడు సూచిస్తూ ఉండవచ్చు (యెషయా 53:3). క్రీస్తును సమరయవాడు అని కొందరు పిలిచారు కూడా (యోహాను 8:48-49). దిక్కులేని పాపులు తమకు తాము చేసుకోలేనిదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి చేస్తాడు – అంటే వారిని రక్షించి శాశ్వత జీవాన్ని ఇస్తాడు (19:10; యోహాను 3:16-17; 10:27-28).

ఇంకా మనందరికీ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ గురించి తెలుసు.

-------- ౦ --------

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment